Skip to content

Dr. Kadiyala Rama Mohana Rai

తెలుగు వెలుగు మా శర్మగారు

శ్రీ మొదలి నాగభూషణ శర్మ నాటక కర్త, దర్శకుడు, నటుడు, నాటక విమర్శకుడు, పరిశోధకుడు, అధ్యాపకుడు, తెలుగు నాట నాటకోద్యమానికి తోడ్పడిన నాటకరంగ ప్రముఖుడు.

శ్రీ మొదలి నాగభూషణ 1935 జులై 24వ తేదీన గుంటూరు జిల్లా ధూళిపూడి గ్రామంలో జన్మించారు. ఎనిమిదవ ఏట తండ్రిగారి ప్రోత్సాహముతో నటునిగా నాటక రంగంలో ప్రవేసించారు. రాముని బుధ్ధిమంత తనం (శరత్ బాబు రచన)లో నటించారు.

చిన్నవయసులోనే శర్మగారు రచించిన “అన్వేషణ” సుప్రసిధ్ధ సాహిత్య మాస పత్రిక ‘భారతి ‘లో ప్రచిరితమైంది. తరువాత ‘జంట పక్షులు ‘(భారతి), అడ్డదారి (ఆంధ్రప్రభ) నాటికలు వీరికి నాటక రచయితగా గుర్తింపు తెచ్చిపెట్టాయి..

1955 నుంచి విజయవాడ, హైదరాబాదు, రేడియో కేంద్రాలు వీరి నాటికలను ప్రసారం చేశాయి. సుప్రసిధ్ధ రచయిత బుచ్చిబాబు, ప్రఖ్యాత కవి దాశరధి ఆకాశవాణి అధికారులుగా వీరి నాటక రచనను ప్రోత్సహించారు.

తొలి దశలో శర్మగారు నాటక రచన చేస్తున్న కాలంలో ప్రఖ్యాత నాటక రచయిత, ప్రయోక్త కొప్పరపు సుబ్బారావు నాటక రచనలో కొన్ని మెలకువలను సూచించి మార్గదర్శకులైనారు.

ఇంగ్లీషు సాహిత్యాన్ని మక్కువతో అధ్యయనం చేసిన శర్మగారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పని చేశారు.

నాగభూషణ శర్మగారి ‘వీలునామా’ (1955) ‘కల-కాపురం'(1955-56), ‘అడ్డదారి ‘ (1958) నాటికలు ఏభై యేళ్ళ తర్వాత కూడ చదివి ఆనందించి నాటాక సమాజాలు తిరిగి ప్రదర్శించదగినవి.

అమెరికా నాటక రంగంపై పరిశోధన చేసిన శర్మగారు అమెరికాలో పెక్కు ఇంగ్లీషు నాటకాలు నాటికలు చూసారు, చేసారు. నాటకరంగ ప్రయోగంలో మెలుకువలను ఆకళించు కున్నారు. ‘బియాండ్ ది హొరైజన్ ‘, ‘హెయిరీ ఏప్’,’డిజైర్ అండర్ ది ఎల్మస్ ‘, స్ట్రేంజ్ ఇంటర్లూడ్ (యుజీన్ ఓనీల్) ‘ఎ స్ట్రీట్ కార్ నేమెడ్ డిజైర్,’ ‘కేట్ అండ్ ఎ హాట్ టిన్ రూఫ్,’ ‘ద మిల్క్ ట్రైన్ డజంట్ స్టాప్ హియర్,’ (టెన్నెస్సీ విల్లియంస్) ‘ది డెత్ ఆఫ్ ఎ సేల్స్ మాన్,'(ఆర్థర్ మిల్లర్) నాటకాలలోని వివిధ జీవితకోణాలను పరిశీలించారు. ఆధునిక తెలుగు నాటకవికాసానికి విశ్వవిఖ్యాత నాటకాలనుండి ప్రేరణ పొందవలసిన అవసరాన్ని గుర్తించారు.

యు. ఎస్. ఏ. ఇల్లినాఇస్ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్ధిగా ఉన్నప్పుడు ‘శాక్రిఫైస్,'(రబీంద్రనాధ్ టాగోర్) నాటకానికి దర్శకత్వం వహించారు. పిక్నిక్ ఆఫ్ ది బ్యాటిల్ ఫీల్డ్,’ నాటకానికి సహ దర్శకులుగా ఉన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలిసారిగా నాటక విభాగాన్ని ప్రారంభించినప్పుడు, ఆ శాఖకి శర్మగారు తొలి ఆచార్యులై తెలుగు నాటక వికాసానికి విశేషమైన కృషి చేసారు.

ఇంకా, ‘యునివెర్సిటీ ఆఫ్ హైదరాబాదు,’ ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యలయ,’ నాటక విభాగలలో ఆచార్యునిగా, నట శిక్షకునిగా, ఉత్తమ నాటక ప్రయోక్తగా తెలుగు నాటక రంగ అభివృధ్ధికి తోడ్పడ్డారు.

‘మన్మధుడు మళ్ళీ పుట్టాడు,” ‘మదన కామరాజు కధ,’ ‘ప్రజానాయకుడు ప్రకాశం,’ శర్మగారికి పేరుతెచ్చిపెట్టిన నాటకాలు.

‘మన్మధుడు మళ్ళీ పుట్టాడు,’ అశ్లీలానికి, అసభ్యతకు దూరంగా, ఉల్లాసంగ, హాస్యభరితంగా ఉంటుంది.

‘మదన కామరాజు కధను,’ శర్మగారు స్వయంగా చదివి వినిపించినప్పుడు, విని ఆనందించాను. విలువలు దిగజారిన జమీందారి జీవన విధానం ఇందులో ఉన్నది. ఏఅమ్మాయి కనిపించినా, అంచెలంచలుగ ప్రేమించి జమీందారు రామరాజు తన అవకతవక చేష్టలతో ప్రేక్షకులను వినోదింప చేస్తాడు.

‘పక్క చూపులు, తొంగి చూపడాలు, ప్రేమ కలాపాలు సాగించటం, రెండు అర్ధాల మాటలు, ప్రమాదం ముంచుకు వస్తే ఏమంచం కిందనో దాక్కోవడం, ఇవేమి కుదరకపోతే బుకాఇంచటం – ఇవన్నీ ఇటువంటి మగధీరుల శృంగార జీవితాలో కనిపించే ఆటుపొట్లు – వీటికి సుతారముగా అద్దం పడుతూ సునిశితంగా మందలిస్తూ, ఆసాంతము హాస్యభరితంగా సాగిపొతుంది మదన కామ రాజు కధ ‘ (గరిమెళ్ళ రామమూర్తి)

నాగభూషణ శర్మగారి పేరు వినగానే చాలమందికి జ్ఞాపకం వచ్చే నాటకం ‘ప్రజా నాయకుడు ప్రకాశం’, చాల పట్టణ్ణాలలో, నగరాలలో 30 కి పైగా ఈ నాటక ప్రదర్శనలు జరిగాయి. ప్రముఖ నటులు కీ. శే. చాట్ల శ్రీరాములు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారి పాత్రలో జీవించారు.

‘ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులుగారి స్వీయ చరిత్ర ‘నా జీవిత యాత్ర,’ ఈ నాటక రచనకు ప్రాతిపదిక. యదార్ధ విషయాలను ఎక్కడా వ్రక్రీకరించకుండా ప్రకాశం గారి జీవిత సంఘటనలకు శర్మగారు చాకచక్యంగా నాటక రూపం ఇచ్చారు. ప్రజా సేవకుడు, దేశభక్తుడు ప్రకాశం గారి త్యాగమయ జీవితాన్ని ధీరత్వాన్ని చూసిన అనుభూతి ఈ నాటకం చూసిన తరువాత తప్పక కలుగుతుంది.

ఇప్పుడీనాటకాన్ని ప్రదర్శించాలంటే ఒక పెద్ద చిక్కు ఎదురుఔతుంది. అదేమంటే ప్రకశంగారి పాత్రకు మహనటుడు చాట్ల శ్రీరాములుగారి లాంటి నటులు లభించటం.

సమకాలిక భారతీయ నాటాకలను ప్రపంచ ప్రసిధ్ధమైన ఇంగ్లీషు నాటకాలను తెనిగించి, వాటికి దర్శకత్వం వహించి, విశ్వవిద్యాలయాల థియెటర్ ఆర్ట్స్ వారి చేత ప్రదర్శింప చేయటం నాగభూషణ శర్మగారు సాధించిన ఘన విజయం.

‘అంధ యుగం’ – ధర్మవీర్ భారతి హిందీ రచనను తెనిగించటంలో నాగభూషణ శర్మగారి శ్రీమతి సహకారం ఉన్నది. ‘నిశబ్దం కోర్టు నడుస్తోంది (విజయ్ టెండూల్కర్) హయవదన – తుగ్లక్ (గిరీష్ కర్నాడ్), చల్ చల్ గుర్రం (చంద్రశేఖర్ ఖంబార్), మృచ్చకటిక (శూద్రకుని రచనకు ఇంగ్లీషు అనువాదం) రాజ ఈడిపస్ (సొఫొక్లిస్) వీరు విశ్వవిద్యాలయలలో ప్రదర్శించిన నాటకాలు.

ఆచార్య ఆత్రేయ నాటకాలను శర్మగారు క్షుణ్ణంగా అధ్యయనం చేయటమేకాక “విశ్వశాంతి” నాటకాన్ని ప్రదర్శించి ప్రశంసలు పొందారు.

“నాటక శిల్పం”, వ్యాస సంపుటులో ప్రాచీన ఆధునిక నాటకాలపై ఆలోచింప చేసే అభిప్రాయాల మాలికలు.

శ్రమకోర్చి శర్మగారు సమకూర్చిన “నాటక పరిభాష” నాటకాభిమానులకు ఉపయోగకరమైనది.

తెలుగు నవల శతజయంతి సందర్భంగా శర్మగారు రచించిన “తెలుగు నవల వికాసం” ఇంక, “తెలుగు సాహిత్యం- గాంధీజీ ప్రభావం” విలువైన సాహిత్య విమర్శా గ్రంధాలు.

శ్రీ మొదలి నాగభూషణ శర్మగారికి అప్పాజోస్యుల – విష్ణుభొట్ల – కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభా పురస్కారం తగినవ్యక్తికి తగిన గౌరవం.

తెలుగు నాటక రంగంలో శర్మగారి కృషిని గుర్తించి భారత ప్రభుత్వం “పద్మ భూషణ్” సత్కారంతో గౌరవించటం సముచితంగా ఉంటుంది.

డా. కడియాల రామమోహన రాయ్

Copyright @ 2023 M.N. Sarma